నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన నిధులు ఇవ్వాలని, రైతంగా సమస్యలు పరిష్కరించాలని 18న జరిగే రైతు ధర్నాను విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో గల ద్వారక నగర్ ఐఎప్టీయూ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నమ్మిన రైతన్నను నట్టెట్లా ముంచుతున్నారని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుందని అన్నారు. పుట్టెడు కష్టాలతో అప్పులు చేసి వేసిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆవేదనలు పాలకుల చెవికెక్కడం లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, గొర్రె మేకల,మత్స్య శాఖలకు తదితర రంగాలకు తగిన నిధులు కేటాయించక అ రంగాల రైతులు కాంట్రాక్ట్, మధ్య దళారుల మోసలకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు తగిన నిధులు కేటాయించాలని, తగిన రుణాలు అందించి వీరి అభివృద్ధికై తోడ్పడాలని, రైతంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు బి. సాయిలు,అగ్గు ఎర్రన్న,ఆర్. బాబురావు, బి. బుచ్చన్న,బి.గంగారం,ఆర్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
