29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

చిక్కరు.. దొరకరు..

Must read

📰 Generate e-Paper Clip

  • . వేధింపుల కారణంగా గత నెలలో ముగ్గురి ఆత్మహత్య
  • . కొలక్కిరాని దర్యాప్తు.. అడ్రస్ లేని బాధ్యులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోయిన ప్రాణం తిరిగిరాదు.. ఆ  ప్రాణం పోయేందుకు కారణమైన వారిని పోలీసులు పట్టుకోరనే చర్చ జిల్లా కేంద్రంలో సాగుతోంది. అప్పులు ఇచ్చిన వ్యక్తుల వేధింపులను తాళలేక నవంబర్ నెలలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నగరంలో తీవ్ర కలకం సృష్టించాయి. అయితే ఏ ఒక్క కేసులోనూ ఇప్పటి వరకు బాధ్యుల అరెస్టు చూపకపోవడం గమనార్హం.

గోదావరిలో దూకిన తండ్రీకూతుళ్లు..

బీజేపీలో ప్రముఖనాయకుడిగా చలామణి అయిన రోషన్ లాల్ తోపాటు అతడి సోదరుడు వికాస్ నగరానికి చెందిన వేణు అనే వ్యక్తి అప్పు ఇచ్చారు. తీసుకున్న డబ్బులు చెల్లించాలని వేణుపై సోదరులిద్దరూ ఒత్తిడి చేయడంతోపాటు ఆయన కూతురిని సైతం వేధించడంతో మనస్తాపానికి గురై అతను నవంబర్ 5వ తేదీన భార్య, కూతురితో కలిసి బాసర గోదావరిలో దూకాడు. తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోగా, వేణు భార్యను స్థానిక జాలర్లు కాపాడారు. ఈ ఘటనపై 6వ తేదీన బాసర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోషన్, వికాస్ పోలీసులకు చిక్కలేదు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. వారు ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ లు వాడడం లేదని, వారి కోసం ప్రత్యేక టీమును ఉత్తరాది  రాష్ర్టాలకు పంపుతున్నామని బాసర పోలీసులు తెలిపారు. నెల రోజులు గడిచినా కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది.

మామా అల్లుళ్ల వేధింపులు తాళలేక..

అప్పు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక నగరంలోని ఆటో నగర్ కు చెందిన హబీబ్ హజర్ నవంబర్ 5న అశోక్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక పూలాంగ్ కు చెందిన అర్షద్ వద్ద హజర్ అప్పు తీసుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బులు తిరిగి రాకపోవడంతో అర్షద్ వడ్డీ కోసం తన మామ  అయిన ఏఎస్సై షకీల్ తో కలిసి హజర్ ను వేధించాడు. తన పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినప్పటికీ హజర్ ను షకీల్ ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి  అప్పులు తిరిగి చెల్లిస్తానని స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించాడు. ఆ తరువాత డబ్బులు చెల్లించకపోవడంతో హజర్ పై వేధింపులు ఎక్కువయ్యాయి. నీవు సచ్చినా సరే డబ్బులు వసూలు చేసి తీరుతామని మామాఅల్లుళ్లు బెదిరించడంతోన మనస్తాపానికి గురైన హజర్ అశోక్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్ డాటాతోపాటు ఇతర ఆధారాలతో హజర్ కుటుంబ సభ్యులు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అర్షద్ పోలీసులకు చిక్కలేదు. మామ పోలీసు కావడంతోనే అల్లుడిని గాయబ్ చేశారనే ఆరోపణలున్నాయి. హజర్ ఆత్మహత్యకు ఏఎస్సై షకీల్ కూడా కారణమని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు శాఖాపరమైన విచారణ చేపట్టడకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

More articles

Latest article