నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: బాపూజీ వాచనాలయం పాలకవర్గ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష పదవికి రిజిస్టార్ పోస్టు ద్వారా తాను నామినేషన్ పత్రాలు పంపగా, దానిని విప్పకుండా తిరిగి పంపించారని కోనేరు సాయికుమార్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాయింట్ సెక్రెటరీ, ఈసీ మెంబర్ల నామినేషన్లను సైతం తిరస్కరించారని, దానిపై మూడు రోజుల క్రితం హైకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. దీనిపై విచారించిన హై కోర్టు నాలుగు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని బాపూజీ వాచనాలయం కార్యదర్శితోపాటు ఎన్నికల అధికారికి నోటీసులు పంపిందన్నారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
