28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందూరుకు అవకాశం లేదా

Must read

📰 Generate e-Paper Clip

  •  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర జిల్లాల అభ్యర్థులకే  అవకాశం 
  •  కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డికేనా 
  • పీఆర్ టీయూ నుంచి మెదక్ జిల్లాకు అవకాశం 
  •  బీఆర్ఎస్,  బీజేపీ అభ్యర్థులు ఎవరో 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు జరుగనున్న ఎన్నికలకు రాజకీయ వేడి రాజుకుంటుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న టి.జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తంరెడ్డి పదవి కాలం మార్చి 29తో ముగియనుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయంలో అంతగా పోటీ కనబడడటం లేదు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి వచ్చే సరికి చాలా మంది ఆశలు  పెట్టుకున్నారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదు ప్రక్రియ గత నెలలో ముగిసిన దానిని ఈ నెల 9 వరకు పొడగించారు. నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  పదవుల కోసం ఆశావహులు ఆశలు అడియాసలవుతున్నాయి. అందుకు  కారణం లేకపోలేదు. 2019లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన నిజామాబాద్ కు  చెందిన చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి  పోటీ చేసిన జీవన్ రెడ్డి 39 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి వచ్చే సరికి రఘోత్తంరెడ్డి   పాతూరి సుధాకర్ రెడ్డిపై 17 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఉమ్మడి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 42 అసెంబ్లీ, ఆరు లోకసభ స్థానాల  పరిధి ఉంది.  అందులో నిజామాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ పోటీకి మాత్రం ఎవరు ఆసక్తి చూపడం లేదు. అయితే కాంగ్రెస్ నుంచి కొత్త వారికి అవకాశం వస్తుందా అని సంశయం వ్యక్తం అవుతుంది. గడిచిన నెల చివరి వారంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో కోర్ కమిటీ మొత్తం తాజా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నే ఖరారు చేసినట్లు తెలిసింది. దానిపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడమే మిగిలింది. దానితో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం లేకుండాపోయినట్లయింది. కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఖరారు చేయడంతో ఇక మిగిలిన ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ ల వైపే అందరూ అసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఆశావహుల పేర్లు రాకపోవడం విశేషం. అయితే బీఆర్ఎస్ తరపున తెలంగాణ ఉద్యమ జేఏసీ నేత రాజారాంయాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తుండడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ తరపున దాని అనుబంధ సంస్థలు  ఓటర్ల నమోదు చేపట్టాయి. బీఆర్ఎస్ లో మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయానికొస్తే గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన కూర రఘోత్తంరెడ్డి  స్థానంలో మహేంధర్ రెడ్డి పేరును ప్రకటించింది. ఆయన ప్రచార క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మెదక్ జిల్లా వాసి మహేంధర్ రెడ్డికి అవకాశం దక్కడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన సంఘం కానీ ఇతర ఉపాధ్యాయ సంఘాల నుంచి కానీ పోటీ లేకుండాపోయింది.  రఘోత్తంరెడ్డి ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తరపున బరిలో ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మిగిలిన ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇప్పటికి తేటతెల్లం కాలేదు. మూడు నెలల్లో ఎన్నికల వేళ ఎలాంటి ఎన్నికల హడావుడి కనిపించడంలేదు. ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా గుర్తింపు పొందిన సంఘాలే బరిలో ఉండడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధానంగా పీఆర్ టీయూ నుంచి మొన్నటి వరకు నిజామాబాద్ లో ఆశావహులు ఉండగా మెదక్ వాసికి అవకాశం దక్కడంపై ఇతర ఉపాధ్యాయ సంఘాల తరపున ఎవరైనా పోటీ చేస్తారా అని తేలాల్సి ఉంది.

More articles

Latest article