అన్ని విధాలుగా బాధిత రైతులను ఆదుకుంటాం

0 14,549
  • వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్
  • నీట మునిగిన పంటలు, కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన

 

నిజామాబాద్, బతుకమ్మ :  జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి  పర్యటించారు. గోదావరి ఉద్ధృతి వల్ల నవీపేట్ మండలం యంచ, అల్జాపూర్, మిట్టాపూర్, కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మేటలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు. కోస్లీ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని గమనించారు.  వరదల వల్ల వాటిల్లిన నష్టం గురించి, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాధిత రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే, కలెక్టర్లకు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ  ఆవేదన వెలిబుచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధిత రైతులు, ప్రజలకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా శ్రీరాంసాగర్ కు వరద

We will support the affected farmers in every way

పోటెత్తి గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అన్నారు. నాలుగు రోజులుగా వరి పైరు, ఇతర పంటలు నీట మునిగి ఉండడం వల్ల చేతికందే పరిస్థితి లేకుండాపోయిందని అన్నారు. సమగ్ర వివరాలతో కూడిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు. కాగా, వరదల వల్ల వాటిల్లిన పంట నష్టం వివరాలను ఒక్క ఎకరం కూడా తప్పిపోకుండా పక్కాగా సేకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుధ్ధ ప్రాతిపదికన చేపట్టాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి, రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ, ప్రజలకు అండగా నిలవాలని హితవు పలికారు. కాగా, వరద తాకిడికి గురైన పంటల విషయంలో వ్యవసాయ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ, పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

We will support the affected farmers in every way

Leave A Reply

Your email address will not be published.