27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాల సందర్శన

Relief efforts underway in flood-affected areas

నిజామాబాద్, బతుకమ్మ : ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గ – హంగర్గ, సాలూర – ఖాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలను బోట్ లు, ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్, ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాలలో ఆశ్రయం ఉంటున్న వారికి భోజనం, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని, ముంపు గ్రామాలలో ఎవరు కూడా చిక్కుబడిపోకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది అందరూ వరద బాధితులకు సహాయంగా నిలుస్తూ, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని, ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ వారి

Relief efforts underway in flood-affected areas

వెంటే ఉందన్న భరోసాను కల్పించాలని హితవు పలికారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన వరి, సోయా, పత్తి, కంది తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు. వరద నీటి ఉద్ధృతి తగ్గిన వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని బాధిత రైతులకు తెలిపారు. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. శ్రీరాంసాగర్ కు వరద పోటెత్తడం వల్ల బ్యాక్ వాటర్ కారణంగా ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ద్వారా 5 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద జలాలను ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నామని తెలిపారు. దీనివల్ల ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ తగ్గి, శుక్రవారం సాయంత్రం నాటికి జలదిగ్బంధం నుండి బయటకు వస్తాయని కలెక్టర్ తెలిపారు. ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు, 7వ బెటాలియన్ పోలీసు బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని, వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు తదితర వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సదుపాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు. భారీ వర్షాలతో వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ రామారావు  తదితరులు ఉన్నారు.

Relief efforts underway in flood-affected areas

More articles

Latest article