29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారుల శిక్షణ తరగతుల్లో కలెక్టర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

ఎన్నికల విధుల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, ఏజెంట్ల నియామకం, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లచే అవగాహన కలిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎం.పీ.టీ.సీ, జెడ్.పీ.టీ.సీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా నిబంధలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా, పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను అనుసరిస్తూ ఆర్.ఓలు నోటిఫికేషన్ జారీ చేసి, ఆ రోజు నుండే ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని, సమయ పాలనను పక్కాగా పాటించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులతో పాటు వారి ప్రతిపాదకులు స్థానికులేనా అన్నది ఓటరు జాబితా ఆధారంగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి సహా ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతించాలని అన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని అన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామినేషన్ల దరఖాస్తులను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్లను నిబంధనలకు అనుగుణంగా సరైన పద్ధతిలో సమర్పించేలా అభ్యర్థులకు సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్.ఓ, ఏ.ఆర్.ఓల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా జెడ్పీ సీ.ఈ.ఓ కార్యాలయంలో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే మాక్ నామినేషన్ ప్రక్రియను నిర్వహించుకోవాలని, దీనివల్ల ఎన్నికల నిర్వహణలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్త పడవచ్చని హితవు పలికారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏమాత్రం సంకోచించకుండా పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఏ దశలోనూ సొంత నిర్ణయాలు తీసుకోకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని అన్నారు. శిక్షణ అదనపు కలెక్టర్ అంకిత్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డిప్యూటీ సీ.ఈ.ఓ సాయన్న, డీ.ఈ.ఓ అశోక్, హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు పాల్గొన్నారు.

Must have a thorough understanding of election duties

More articles

Latest article