భిక్కనూర్, బతుకమ్మ :
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ సి పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. పరీక్షకు విద్యార్థులు ఎంతమంది హాజరయ్యారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు భయాందోళనలు చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలు తాగునీరు, కూర్చున్న ఏర్పాటు, భద్రతా చర్యలు, మెడికల్ సిబ్బంది తదితర అంశాలు పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించి పరీక్ష పూర్తి అయిన వెంటనే జవాబు పత్రాలు పోలీసు బందోబస్తు తో తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

