25.4 C
Hyderabad

నీటి వనరులు వృధా కాకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి

Continuous monitoring must be maintained to prevent the wastage of water resources.

Must read

📰 Generate e-Paper Clip

 

అధికారులతో సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో, అందుబాటులో ఉన్న నీటి వనరులు వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష జరిపారు. వివిధ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల గురించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే శ్రీరాంసాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా చుక్క నీరు సైతం వృధా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలకు నీటిని నిలువ ఉంచుతూ, పంటలను కాపాడేందుకు వీలుగా రెండు తడుల వరకు సాగు నీటిని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాలు చివరి ఆయకట్టు వరకు చేరేలా గట్టి నిఘా ఉంచాలని, నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నీటి నిల్వలు వృధా కాకుండా చూడాలని సూచించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలలో ఎంతమాత్రం రాజీ పడబోమని, నీటి వృధా జరిగి పంటలు ఎండితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. నీటి వృధాను నిలువరించేందుకు అవసరమైన చోట కాలువలు, తూముల మరమ్మతులు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఈ పనులకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.కాగా, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. ఖరీఫ్ పంట సేకరణకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా గోడౌన్ లలో నిలువ ఉన్న బియ్యం నిల్వలను నిర్దేశిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించాలని సూచించారు. విద్యార్థిని, విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో యూనిఫాంలు కుట్టి అందించేలా స్వయం సహాయక సంఘాలకు బాధ్యతను అప్పగించడం జరిగిందని, వారు సకాలంలో దుస్తులు కుట్టి ఇచ్చేలా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా రెవెన్యూ అధికారిణి గీత, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article