27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఆశా వర్కర్ లపై పని భారాన్ని తగ్గించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆశా వర్కర్ లకు ఇస్తానన్న వేతనాన్ని అమలు చేయాలి

 

. . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా లో అధికారులు ఆశ వర్కర్ల పైన తీవ్రమైన పని భారాన్ని మోపుతూ, సంబంధం లేని పనులను ఆశ వర్కర్లకు అప్పగిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు అన్నారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఆశా వర్కర్ల జిల్లా కమిటీ సమావేశంలో జిల్లాలోని వివిధ పీఎస్ సీల ఆశా వర్కర్లు పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఫీల్డ్ వర్కర్ లుగా ఉండాల్సిన ఆశా వర్కర్లను సబ్ సెంటర్లలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. రోజువారి ఇంటింటి సర్వేను నిర్వహించాల్సిన ఆశా వర్కర్లు ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని వారికి తగు సూచనలు ఇవ్వాల్సిన పని ఉంటుందని, అదే విధంగా గర్భిణీలు బాలింతలకు ఎప్పటికప్పుడు చెకప్ చేయించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశ వర్కర్లకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీని అమలు జరపలేదని, ఉద్యోగ భద్రత కల్పించలేదని అన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, అమలు జరపాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా నాయకులు సుకన్య, రేణుక, విజయ, నర్సు, బాలమణి, వనిత, రాణి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article