26 C
Hyderabad

తెయు క్యాంపస్ లో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  అర్బన్ ఎమ్మెల్యేకు  ఎబివిపి వినతి

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

డిచ్ పల్లి లోని తెలంగాణ విశ్వావిద్యాలయం  క్యాంపస్‌లో ప్రభుత్వ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ కు ఎబివిపి నాయకులు వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా ఎబివిపి ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  ప్రభుత్వ ఫార్మసీ కళాశాల లేకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే చొరవ తీసుకుని జీవో వచ్చేలా చూడాలి ఎమ్మెల్యే ను కోరినట్లు తెలిపారు.  ప్రతి ఏటా ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేస్తున్న వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు స్థానికంగా ప్రభుత్వ ఫార్మసీ కళాశాల లేకపోవడం పెద్ద శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎంతో డిమాండ్, ఉపాధి అవకాశాలు ఉన్న బి.ఫార్మసి చదవాలంటే ఇక్కడి విద్యార్థులు సుమారు 250 నుంచి 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల్లో లక్షలాది రూపాయల అధిక ఫీజులు చెల్లించలేక, గ్రామీణ ,వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌లో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉన్నందున, ఇక్కడ ప్రభుత్వ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. నిజామాబాద్ అర్బన్ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కళాశాల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ జిల్లా కన్వీనర్ అక్షయ్, యూనివర్సిటీ కార్యదర్శి సమీర్, విద్యార్థి నాయకులు దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article