21.8 C
Hyderabad

13 ఏళ్ల దాంపత్యానికి పవన్‌ కల్యాణ్‌ స్వస్తి

Pawan Kalyan ends 13-year marriage

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మూడో భార్య అన్నా కొణిదెలతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన

 

. . . పరస్పర అంగీకారంతోనే నిర్ణయం

 

. . .  మంచి స్నేహితులుగా కొనసాగుతామని వెల్లడి

 

. . . పిల్లల బాధ్యత ఇద్దరిదీ

 

. . . వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన తన భార్య అన్నా కొణిదెల (అన్నా లెజినోవా)తో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. 13 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ సోమవారం అర్ధరాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని, అనుభవాలను కలిసి పంచుకున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని పవన్‌ కల్యాణ్‌, అన్నా కొణిదెల తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. భార్యాభర్తలుగా తమ బంధం ముగిసినప్పటికీ ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం కొనసాగుతుందని, ఇకపై మంచి స్నేహితులుగా ఉంటామని వెల్లడించారు.

. . . పిల్లల శ్రేయస్సే ప్రథమ ప్రాధాన్యం

తమ పిల్లల భవిష్యత్తు, సంతోషం, సంక్షేమం విషయంలో ఇద్దరూ సమాన బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను కొనసాగిస్తామని, పిల్లల శ్రేయస్సే ఎల్లప్పుడూ తమ ఉమ్మడి ప్రాధాన్యంగా ఉంటుందని తెలిపారు. తమ వైవాహిక బంధం ముగిసేందుకు దారితీసిన కారణాలను మాత్రం ప్రకటనలో వెల్లడించలేదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని పేర్కొంటూ, ప్రస్తుత సున్నితమైన సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

. . . 2013లో వివాహం . . . ఇద్దరు పిల్లలు

పవన్‌ కల్యాణ్‌, రష్యాకు చెందిన అన్నా లెజినోవా 2013 సెప్టెంబర్‌ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌. గతంలో పవన్‌ కల్యాణ్‌ 1997లో నందినిని వివాహం చేసుకోగా, ఆ బంధం అనంతరం విడాకులతో ముగిసింది. 2009లో నటి రేణు దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతరం 2012లో విడాకులు తీసుకున్నారు. 2013లో అన్నా లెజినోవాను మూడో వివాహం చేసుకున్నారు. తాజాగా 13 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం అన్నాతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే విడాకుల ప్రక్రియకు సంబంధించిన చట్టపరమైన తుది వివరాలు, ఇతర అంశాలపై సంయుక్త ప్రకటనలో ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

More articles

Latest article