24.2 C
Hyderabad

కొక్కొండ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

MLA Madan Mohan inaugurated the Women's Federation building in Kokkonda village

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన మహిళా స్వయం సహాయక సంఘం భవనంతో పాటు, వానాకాలం (ఖరీఫ్) 2026-27 సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. బుధవారం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి స్పందించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో కొక్కొండ గ్రామ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ సంఘ కార్యకలాపాల నిర్వహణకు ప్రత్యేక భవనం అవసరమని ఎమ్మెల్యే మదన్ మోహన్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రూ.10 లక్షలు మంజూరు చేయడంతో భవన నిర్మాణం పూర్తయిందన్నారు. నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సంఘ కార్యకలాపాలను సమర్థవంతంగా కొనసాగించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వావలంబనకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళా సంఘాల విజ్ఞప్తికి స్పందించి, ఇచ్చిన హామీని నెరవేర్చి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కి మహిళా సంఘాల సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో వానాకాలం (ఖరీఫ్) 2026-27  సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన 7 సన్న రకాల ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్‌ చెల్లించడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, మహిళల అభివృద్ధికి తోడ్పాటునందిస్తూ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

MLA Madan Mohan inaugurated the Women's Federation building in Kokkonda village
 

More articles

Latest article