కమ్మర్ పల్లి, బతుకమ్మ :
మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం మానాల గ్రామంలో సుమారు రూ.14 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, నాయకులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మానాల గ్రామం ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తాత్కాలికంగా నీటి ఎద్దడి నివారణకు తక్షణమే అవసరమైన నీటి సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని, సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన అనంతరం లిఫ్ట్ ద్వారా మానాలకు సాగు,తాగునీటిని అందించి దీర్ఘకాలికంగా నీటి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. తక్కువ పెట్టుబడితో స్థిరమైన,అధిక ఆదాయం వచ్చే పంటల వైపు రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పామ్ ఆయిల్ సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశం ఉన్నందున ఈ పంట వైపు రైతులు మారాలని సూచించారు. పామ్ ఆయిల్‌కు అవసరమైన మార్కెట్, ప్రాసెసింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా నందిపేట్ మండలం లక్కంపల్లి సెజ్ ప్రాంతంలో పామ్ ఆయిల్ ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగం అనుసంధానంతో స్థానిక రైతులకు మార్కెట్ సౌకర్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేసే దిశగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, ఇప్పటివరకు సుమారు రూ.12 వేల కోట్లను ఆర్టీసీకి చెల్లించిందని పేర్కొన్నారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులకు యజమానులుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించేందుకు హైదరాబాద్‌లోని శిల్పారామంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి, విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ గతంలో రూ.5 లక్షలుగా ఉన్న ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని వెల్లడించారు. యువతకు ఉద్యోగ భరోసా కల్పించిన ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేశాయని ఎమ్మెల్యే విమర్శించారు.

