. . . మృతదేహాన్ని కడసారి చూసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరం
. . . ఇదేనా ప్రజా ప్రభుత్వం -ఇదేనా ప్రజా పాలన
హైదరాబాద్, బతుకమ్మ :
చనిపోయిన మనిషిని కడసారి చూడటానికి కూడా వెళ్లనివ్వరా? కనీసం చివరి చూపు చూసి నివాళులర్పించేందుకు వెళ్లే అవకాశం కూడా లేదా? ఇంత ఘోరమా పోలీసులు ఇంట్లో నుండి బయలుదేరుతుంటే పోలీసులు అడ్డుకోవడం అమానూషమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి సుమారు 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన పోలాస సుధాకర్‌కు నివాళులర్పించేందుకు బయలుదేరిన ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ముందస్తుగా అడ్డుకున్నారు. భీమ్‌గల్ వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఒక ప్రజా ప్రతినిధిని తన ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించడం ఏంటి? పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చివరకు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని కడసారి చూడటానికి కూడా వెళ్లనివ్వకపోవడం దారుణమని ఆయన వ్యక్తం చేశారు. పోలాస సుధాకర్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని,ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా చిన్న టీ స్టాల్ నిర్వహించుకుంటూ జీవనం సాగించేవారని ఆయన పేర్కొన్నారు. ఒక సామాన్య వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకొని తీవ్రంగా కాలిన గాయాలతో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహానికి నివాళులర్పించేందుకు మాత్రమే తాను వెళ్తున్నానని, అయినప్పటికీ పోలీసులు తనను ఇంటి వద్దే అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తికి కడసారి చూపు కూడా దక్కకుండా అడ్డుకోవడం ఏం పాలన? ప్రజా పాలన పేరుతో ఇంత నిర్బంధం ఎందుకు? ఒక సాధారణ వ్యక్తి మృతిపై సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా ప్రజాప్రతినిధికి స్వేచ్ఛ లేకపోవడం బాధకరమని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలాస సుధాకర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
