. . . కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే
. . . బిజెపి కిసాన్ మోర్చా సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారులు పై వచ్చిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం నిజామాబాద్ అర్బన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు అనేక హామీలు ఇచ్చి ఒకటి నెరవేర్చలేదని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు వేల ఆర్థిక సాయం, రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే ఉంటుందని, వరి క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు. కేవలం రైతులనే కాకుండా మహిళలకు, యువతీ యువకులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. ఎల్ నినో ప్రభావం రాష్ట్రం పై తీవ్రంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన పట్టించుకోలేదన్నారు. సమయం దాటిన తర్వాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పడం విడ్డూరమన్నారు. అప్పటికే రైతులు వరి వేసుకున్నారని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీ, పోసి ప్రక్షాళన అంటూ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ రైతులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ వ్యవహరించిన మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల్లో తన వాటాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తామే చేస్తున్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బోధన్ నుంచి జగిత్యాల వరకు 320 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ చేపట్టడం అభినందనీయమని చెప్పారు కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, హరీష్ రెడ్డి, సుగంధం హరీష్, పద్మా రెడ్డి, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు రాము, మల్కాయి మహేందర్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ఓబీసీ మోర్చరాష్ట్ర ప్రతినిధి స్వామి యాదవ్, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు వనిత, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జస్పాల్ సింగ్, యువ మోర్చ రాష్ట్ర సహా కోశాధికారి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

