. . . తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, బతుకమ్మ :
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు అని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన సందర్భాన్ని చారిత్రక వాస్తవాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలని శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిన విషయాన్ని తిరిగి ప్రజల చర్చలోకి తీసుకొచ్చిందన్నారు. 1989లో ‘మా తెలంగాణ’ పత్రిక ఆవిష్కరణతో తెలంగాణ చరిత్ర, అస్తిత్వంపై చర్చ ప్రారంభమైందని, 1996లో వరంగల్‌లో జరిగిన సమావేశం తరువాత తెలంగాణ వాదం ప్రజల్లోకి వెళ్లిందని గుర్తు చేశారు.సెప్టెంబర్ 17ను కేవలం సైనిక చర్య ఫలితంగా చూడటం సరికాదని, నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాల పాత్రను విస్మరించలేమన్నారు. మతపరమైన కోణంలో ప్రచారం చేస్తూ తెలంగాణలోని గంగా-జమునా తహజీబ్‌కు భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. ప్రజలు కోరుకున్నది ప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామిక సమాజమని, ఆ లక్ష్యాల సాధన కోసం పోరాట స్ఫూర్తిని కొనసాగించాలన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో.. కేసీఆర్ కుటుంబం పేర్లతో అక్రమంగా ఉన్నట్లు తేలిన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, భూమిలేని పేద దళితులకు, తెలంగాణ ఉద్యమకారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ భూములు కొద్దిమంది చేతుల్లో ఉండకుండా సామాజిక న్యాయం కోసం వినియోగించాలన్నారు. నాటి నిజాం వ్యతిరేక పోరాటం నుంచి సీమాంధ్ర పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమం వరకు ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
