. . . ఉద్యోగులంతా ఐక్యంగా 10న చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి
. . . టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ లో నిర్వహించబోయే చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయుట కొరకు టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవన్ లోని స్వామినాథం సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాక సమావేశానికి టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. తమ ప్రధానమైన డిమాండ్లపై ఏకవాక్య తీర్మానం చేసి పరిష్కరించాలని లేనియెడల తదుపరి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు. 2వ వేతన సవరణ సంఘం అమలు చేయాలని, 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే తెప్పించి 1.7.2023 నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యం డీఏలు ఎటువంటి ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కోరారు.ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సుమారు రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, ప్రతి నెల కనీసం రూ.2 వేల కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని, ఉద్యోగుల భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగ సంఘాల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించి ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగులంతా ఐక్యంగా చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, నరసింహారెడ్డి,స్వామి, జిల్లా కన్వీనర్ అలుక కిషన్, కో కన్వీనర్ శంకర్, రమన్ రెడ్డి, కో చైర్మన్లురమేష్, అమృత్ కుమార్,కృష్ణారెడ్డి,ప్రవీణ్ కుమార్, ధర్మేందర్, సురేష్, శ్రీనివాస్, నరసయ్య, నేతికుంట శేఖర్, అన్ని భాగస్వామ్య సంఘాల నాయకులు, టీఎన్జీవో రాష్ట్ర నాయకులు, అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
