. . . రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ఒట్టిబోయిన గ్రామాలు
. . . బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి శనిలా దాపురించిన, పల్లెల ప్రగతికి నిధులు నిల్ అని, అభివృద్ధి సంక్షేమం కిల్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి 1000 రోజులు గడుస్తున్నా అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ 420 మోసాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలో పల్లెల్లో విధ్వంసం.. పడకేసిన పారిశుధ్యం అంశంపై నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కాలసర్పం పల్లె ప్రగతిని కాటేస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ గ్రామాలు ఒట్టిబోతున్నట్లు ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ళ పాలనలో అభివృద్ధి జరగని పల్లె లేదు, సంక్షేమందని ఇల్లు లేదు అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతీ కంట్లో విషాదం తాండవిస్తోందని ఆయన వ్యాఖ్యా నించారు. కేసీఆర్ పాలనలో గ్రామాలన్నీ ధనధాన్య రాసులతో నిత్యం సంక్రాంతి పండుగలా మెరిసి పోయాయన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పల్లెలన్నీ ఒట్టిబోయి కళావిహీనమయ్యాయని విమర్శించారు. రైతులు సాగునీటి జలాల పరవళ్ళు చాలా రోజులైంది. చెరువులు ఎండిపోతున్నాయి. చేపలు చచ్చిపోతు న్నాయి. పల్లెల్లో చేతి వృత్తులు చావుకు దగ్గరవుతున్నాయి. రుణమాఫీ కాక, రైతు భరోసా నిధులు అందక, రైతు బీమా నిర్వీర్యమై, యూరియా దొరకక రైతు కుటుంబాలలో నిస్తేజం నెలకొంది ఫలితంగా పల్లెలు మరింత వన్నె తగ్గి గ్రామీణులంతా రేవంత్ రెడ్డి పోవాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అని నినదిస్తున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో పల్లెల పరిస్థితి పూర్తిగా తారుమారైపోయిందన్నారు. పట్టించుకునే వారు లేక పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయన్నారు.నిధులు లేక పంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు మూలన పడ్డాయని,నడుస్తున్న వాహనాలకు సైతం చాలా వరకు రిపేర్లు ఉన్నాయని అన్నారు.తెలంగాణ పల్లెలు కేసీఆర్ హయాంలో ఆదర్శం.నేడు కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తనన్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే మిషన్ భగీరథ స్కీమ్ ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుతంత్రం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను కాంగ్రెస్ పాలకులు చంక నాకించారని, పల్లెల్లో కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడూ పోతుందో తెలియని స్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

