26.9 C
Hyderabad

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు, జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి, వ్యాధి నిరోధక టీకాలపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, నీటి ట్యాంకులను వారానికోసారి శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, ఖాళీ స్థలాలు, మురుగునీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వినియోగించాలని ఆదేశించారు. డెంగీ కేసు నమోదైన ఇంటి చుట్టూ 50 ఇళ్ల పరిధిలో పైరెత్రం స్ప్రే, 100 ఇళ్ల పరిధిలో టెమిఫాస్ స్ప్రే చేపట్టాలని తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే నిర్వహించడంతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు. యాంటీ లార్వల్ స్ప్రే, ఫాగింగ్ కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’గా నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని అన్నారు. నీటి కాలుష్యం ద్వారా వ్యాప్తి చెందే టైఫాయిడ్, డయేరియా, అతిసారం, కలరా తదితర వ్యాధులను అరికట్టేందుకు నీటి పరీక్ష కిట్లతో నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని సూచించారు. డెంగీ బాధితులు ద్రవ ఆహారాన్ని తరచుగా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచన మేరకు పారాసెటమాల్ వాడుతూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆరు నెలల చికిత్సా కోర్సును పూర్తి చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. జీవనశైలి వ్యాధుల నియంత్రణలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల కోసం పెండింగ్‌లో ఉన్న వారందరికీ పరీక్షలు పూర్తి చేసి ఎమ్మా లాగిన్‌లో వివరాలను నమోదు చేయాలని, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారందరి వివరాలను లైన్ లిస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక టీకాల ద్వారా నియంత్రించగల వ్యాధులను టీకాల ద్వారా సమర్థంగా అరికట్టవచ్చని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. అనుమానిత ఏఎఫ్‌పీ, మీజిల్స్, షాంపూల్స్ కేసులకు సంబంధించిన నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డీటీసీవో డాక్టర్ దేవి నాగేశ్వరి, పీఓడీటీ డాక్టర్ అంజన, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ నారాయణ, హెచ్‌ఈఈవో జహీద్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, వివిధ పీహెచ్‌సీల సీఎచ్ఓలు, హెచ్‌ఈలు, హెచ్‌ఈఓలు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

 

Preemptive measures must be taken to control seasonal diseases.

More articles

Latest article