. . . అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
. . . గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ, మనీ ట్రాన్స్ ఫర్ కేంద్రాల వివరాల సేకరణ
. . . బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసం.. 28కు పైగా కేసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ :
పోలీసు అధికారులమంటూ అమాయకులను నమ్మించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి రూ.18 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్‌పేటలోని అల్మాస్‌గూడలో నివసిస్తున్న కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్‌పేటలో నివసిస్తున్న కట్కూరి శరత్ కుమార్ (31) ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులు గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ కేంద్రాలు, మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సేకరించేవారని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి తాము పోలీసు అధికారులమని పరిచయం చేసుకునేవారు. అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయని చెప్పి, ఫోన్‌పే ద్వారా నగదు పంపించాలని నమ్మించేవారని వివరించారు. మోసానికి ముందుగానే పెట్రోల్ బంక్ సిబ్బందిని సంప్రదించి తమ వాహనం లేదా బోర్ బండి మరమ్మతులకు వచ్చిందని చెప్పి, తమ సార్ డబ్బులు వారి ఫోన్ నంబర్‌కు పంపిస్తారని పేర్కొంటూ నంబర్ తీసుకునేవారు. ఆ నంబర్‌ను బాధితులకు ఇచ్చి మీసేవ నిర్వాహకుల ద్వారా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయించేవారు. అనంతరం పెట్రోల్ బంక్‌కు వెళ్లి ఆ నగదును తీసుకునేవారని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో చందుర్తి మండలానికి చెందిన చిలుక పెంటయ్యకు నిందితులు ఫోన్ చేసి, తాము చందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డిగా మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించామని, అత్యవసరంగా రూ.70 వేలు అవసరమని నమ్మించారు. వారి మాటలను నమ్మిన పెంటయ్య డబ్బులు పంపేందుకు సిద్ధం కాగా, నిందితులు హైదరాబాద్‌లోని ఓ పెట్రోల్ బంక్ ఫోన్ నంబర్ ఇచ్చారు. దీంతో పెంటయ్య ఆ నంబర్‌కు రూ.70 వేలు ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు. డబ్బులు అందిన వెంటనే నిందితులు ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన పెంటయ్య చందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్‌ఎస్‌ఐ జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నేరం ద్వారా సమకూరిన సొమ్ములో భాగంగా రూ.18 వేల నగదుతో పాటు మోసాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసిన సీఐ రవీందర్, ఎస్‌ఐ రమేష్, ఆర్‌ఎస్‌ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.
