. . . హేట్ స్పీచ్‌పై కఠిన చర్యలు అవసరం
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఎంతో కీలకమని, అదే సమయంలో కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాల ఆధారంగా ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు సామాజిక శాంతి, సామరస్యానికి భంగం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ స్పష్టం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ హేట్ స్పీచ్ సెలెక్ట్ కమిటీ రెండవ సమావేశం చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మీ, మాణిక్ రావు, అబ్దుల్ బలాల, శాసనసభ కార్యదర్శి తిరుపతి, హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. సమావేశంలో హేట్ స్పీచ్‌ను అరికట్టేందుకు అవసరమైన చట్టపరమైన అంశాలు, ప్రస్తుత చట్టాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై సమగ్రంగా చర్చించారు. ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించే విషయంలో ప్రస్తుత పరిస్థితులు, చట్టపరమైన లోపాలు, అమలు విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ప్రజల భావప్రకటన హక్కును గౌరవిస్తూనే, ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలను నిరోధించే సమతుల్య విధానాన్ని రూపొందించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ, ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తించేలా సిఫార్సులు రూపొందించేందుకు కమిటీ పనిచేస్తుందని తెలిపారు. సామాజిక సామరస్యం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చట్టపరమైన, పరిపాలనా చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరంపై సమావేశంలో అధికారులు, కమిటీ సభ్యులు అభిప్రాయాలను పంచుకున్నారు.

