. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సీఎంఆర్ ధాన్యం, బియ్యం నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) రైస్ మిల్లుల్లో చోటుచేసుకున్న అవకతవకలకు సంబంధించి నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై మంగళవారం సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల దర్యాప్తు స్థితి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డుల పరిశీలన, నిందితులపై చేపడుతున్న చట్టపరమైన చర్యలు, మిగిలిన కేసుల విచారణను వేగవంతం చేయాల్సిన అవసరం వంటి అంశాలను కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సివిల్ సప్లై శాఖ అధికారులు, పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు పునరావృతం కాకుండా నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, జిల్లా సివిల్ సప్లై అధికారి ఎం. శ్రీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ ప్రవీణ్, అసిస్టెంట్ మేనేజర్ అరవింద్ రెడ్డి, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు దయానంద్ గుప్తా, రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి తదితర అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
