29 C
Hyderabad
Monday, August 3, 2026

లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . విద్యార్థి సంఘాల నాయకులు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

విద్యను వ్యాపారంగా మార్చిన లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, అడ్మిషన్ ఫీజుల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ పాఠశాలలో విద్యార్థి సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేపట్టారు. అనంతరం పాఠశాలలో పుస్తకాల విక్రయం జరుగుతున్న గదిని సంబంధిత అధికారులతో సీజ్ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ ఫీజు పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేల చొప్పున మొత్తం సుమారు రూ. 6 లక్షలు అక్రమంగా వసూలు చేసిందని ఆరోపించారు. ఈ మొత్తాన్ని వెంటనే సంబంధిత విద్యార్థులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులపై తల్లిదండ్రులు లేదా విద్యార్థులు ప్రశ్నిస్తే పాఠశాల ప్రిన్సిపాల్ స్వాతిప్రియ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అన్ని రకాల ఫీజులు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని ప్రిన్సిపాల్ చెబుతున్నారని పేర్కొంటూ, ఈ అంశంపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని, లేకపోతే అధికారులు పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అదే విధంగా పాఠశాలలో గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయకుండా రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యార్థులకు అవసరమైన ఆటస్థలం, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయుల స్థానంలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారితో బోధన చేయిస్తున్నారని, దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని విమర్శించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో బీవీఎం జిల్లా అధ్యక్షుడు జీవీఎం విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, పీడీఎస్యూత జిల్లా కార్యదర్శి సురేష్, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మ సురేష్, జీవీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు నితిన్, అర్బస్, బుల్లెట్ సాయినాథ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Action must be taken against the management of Little Scholar School.

More articles

Latest article