హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణలోని టైర్-2 నగరాల్లో ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ టైర్-2 ఐటీ నగరాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా జిల్లాలకు విస్తరించే దిశగా కృషి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రామీణ, పట్టణ యువతకు స్థానికంగానే నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడం, హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా 2020లో రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ, జిఆర్ఐడి పాలసీలను అమలు చేసి దాదాపు 50 వేల సాంకేతిక ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఆధునిక ఐటీ టవర్లు నిర్మించామని తెలిపారు. సైయెంట్, టెక్ మహీంద్రా వంటి ప్రముఖ సంస్థలు వరంగల్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం తెలంగాణ టైర్-2 ఐటీ మోడల్ విజయానికి నిదర్శనమని అన్నారు. అయితే గత రెండేళ్లలో జిల్లాల ఐటీ విస్తరణ మందగించడం, ఐటీ టవర్ల ఆక్యుపెన్సీ తగ్గడం, కొన్ని సంస్థలు కార్యకలాపాలను కుదించుకోవడం ఆందోళన కలిగించే అంశాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టైర్-2 ఐటీ ఎకోసిస్టమ్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటు చేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో ఏఐ, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్ డిజైన్, డీప్ టెక్ రంగాలపై దృష్టి సారించే ఎస్ టిపిఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు. అదనంగా మరో టైర్-2 నగరంలో ఎస్ టిపిఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే జిల్లాల్లో నిర్మించిన ఐటీ టవర్లను వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వ ఏఐ, డిజిటల్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను తెలంగాణ జిల్లాలకు విస్తరించాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే అవసరమైన మౌలిక సదుపాయాలు, విధానాలు సిద్ధంగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే టైర్-2 నగరాలు మరోసారి ఉపాధి, ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఎదగడంతో పాటు దేశవ్యాప్తంగా సమతుల్య డిజిటల్ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
