. . . జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
బిచ్కుంద, బతుకమ్మ :
32 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక ఉద్యమ ప్రయాణం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం సాగిన పోరాటాలు, పలు సామాజిక అంశాలపై విజయవంతమైన ఉద్యమాల అనంతరం నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఉద్యమ శ్రేణులకు కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మార్కెట్ యార్డులో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల హక్కుల కోసం మాత్రమే కాకుండా మానవతా ఉద్యమంగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సాగించిన పోరాటంతో పాటు గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారుల కోసం చేసిన ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ సాధన, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ల పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, రేషన్ బియ్యం పెంపు వంటి అనేక సామాజిక విజయాలు ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితాల్లో భాగమని తెలిపారు. సామాజిక బాధ్యతతో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసి విజయాలు సాధించేందుకు యువతరం, విద్యావంతులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. అన్ని మండలాలు, జిల్లా స్థాయిలో నూతన కమిటీల నిర్మాణంలో యువత, విద్యావంతులు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, పెద్దబూరి గంగారాం మాదిగ, మావురం శ్రీకాంత్ మాదిగ, గోనె సురేష్ మాదిగ, మేత్రి హనుమాండ్లు, గుడ్ల లక్ష్మణ్, బొడికె హనుమాండ్లు, దర్శన్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

