29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట స్థావరం గుట్టురట్టు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నలుగురు అరెస్ట్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీబీపేట్ ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. నేరస్తుల వద్ద నుంచి రూ.7,662 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

. . . జూదానికి దూరంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

జూదం ప్రమాదకరమైన వ్యసనమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. జూదానికి బానిసలైతే వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక జీవితాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో చట్టవిరుద్ధమైన పేకాట, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి జూదం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా పేకాట లేదా ఇతర జూద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్‌ – 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.

More articles

Latest article