. . . పోలీసుల విచారణలో వెల్లడి
. . . బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
నిజామాబాద్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్ర జనరల్ ఆసుపత్రి నుంచి బాలుడి కిడ్నాప్ వ్యవహరంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిక్షాటన కోసమే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఈ నెల 18న అర్ధరాత్రి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి నుంచి కిడ్నాప్ అయిన మణికంఠ (1) కేసును పోలీసులు 36 గంటల్లోనే చేదించారు. నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన రాజు, లక్ష్మీలు రాత్రి జీజీహెచ్ ఆవరణలో ఇద్దరు పిల్లలతో నిద్రించారు. నాందేడ్ జిల్లాకు చెందిన అంజూమ్ బేగం ఆమె పది సంవత్సరాల కూతురు, దుర్గప్రభు రావుబా మోహితే అను ముగ్గురు తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మణికంఠను ఎత్తుకుని వెళ్లిపోయారు. బస్టాండ్ వద్ద ఆటో మాట్లాడుకుని రైల్వేస్టేషన్ కు వెళ్లి నాందేడ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. రైలు అనుకున్న సమయానికి లేకపోవడంతో ఆటోలో బోధన్ రోడ్డులోని నాందేడ్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సీసీటీవీ పుటేజిల ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలపై ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని విచారిస్తున్నామని తెలిపారు. వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. బాలుడి కిడ్నాప్ కేసును చాకచక్యంగా చేదించడంలో ఏఎస్సై షకీల్, కానిస్టేబుళ్లు గంగారాం, అనూష, కేర్భాజి, రాములును అభినందించారు.

