. . . జిల్లా కలెక్టర్ అభినందనలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చే ప్రధానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

