27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అర్హతలేని వైద్యులపై జిల్లా వైద్యశాఖ చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు వైద్య కేంద్రాలు మూసివేసిన డీఎంహెచ్ఓ

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

ఆర్మూర్ పట్టణంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హతలేని వైద్యులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కఠిన చర్యలు చేపట్టింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కమలా నెహ్రూ కాలనీలో నిర్వహిస్తున్న ప్రియాంక వైద్య కేంద్రం, భారతి వైద్య కేంద్రాలను గురువారం మూసివేశారు. అధికారుల సమాచారం ప్రకారం, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా కొందరు వ్యక్తులు వైద్యులుగా వ్యవహరిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. ఆయుర్వేద వైద్యం పేరుతో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడమే కాకుండా, శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల పలువురు రోగులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

 

District Medical Department takes action against unqualified doctors

 

గత ఏడాది కూడా ఇదే కేంద్రాలపై జిల్లా వైద్యశాఖ చర్యలు తీసుకుని మూసివేయడంతో పాటు నిర్వాహకుడు సమీర్ రాయ్‌పై ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ తిరిగి కేంద్రాలను ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. స్థానికుల ఫిర్యాదుల మేరకు ఈ నెల ఆరవ తేదీన ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన అధికారులు వైద్య కేంద్రాలను మరోసారి మూసివేసి నివేదికను పోలీస్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ, ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు పొందిన అర్హత కలిగిన వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని సూచించారు. అర్హతలేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవడం వల్ల ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులకు ప్రజల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. అర్హతలేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని వైద్య కేంద్రాలను పూర్తిగా తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని సమాచారం. ఈ తనిఖీల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్, డాక్టర్ సుప్రియ, షికార, ఆరోగ్య బోధకులు వేణుగోపాల్, సాయన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article