30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజలకు తక్షణ సేవలకై కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 నిరంతరం పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పండుగ సమయంలో ఎవరైనా అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గమనిస్తే వెంటనే జిల్లా పోలీస్ హెల్ప్‌ లైన్ నంబర్ 8712686133 లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో 6 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాటిలో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని, వాహనాలను ఆపడం లేదా తనిఖీలు నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సోషల్ మీడియా వేదికలపై ద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవం, సోదరభావంతో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించే వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని, ప్రజలందరూ పోలీసులతో సహకరించి జిల్లాలో శాంతిని కాపాడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, కోరారు.

More articles

Latest article