. . . రేపటి భయం . . . నేటి ఆందోళనకు కారణం
. . . బంకుల్లో నో స్టాక్ బోర్డుతో వాహనదారుల్లో ఆందోళన
. . . బంకుల్లో భారీగా వాహనదారుల క్యూ
. . . కొరత లేదంటున్న ప్రభుత్వం
హైదరాబాద్, బతుకమ్మ :
పెట్రోల్ బంకులు మూతపడతాయన్న చిన్నపాటి వదంతులు ప్రజల్లో ఆందోళన పెంచాయి. కేంద్రం మొదలుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రకటించినప్పటికీ వాహనదారులు బంక్ లకు క్యూ కట్టడంతో రద్దీ పెరిగింది. ఇటీవల ట్రంప్ ఐదు రోజుల యుద్ద విరమణ ప్రకటనతో ఇంధన కొరత తీరుతుందని అందరూ భావించారు. అంతే గాకుండా హర్మోజ్ జలసంధి నుంచి ఇండియాకు ఎల్ పీజీ, సీఎన్ జీ, క్రూడాయిల్ రాక కూడా ప్రారంభమైన ఎక్కడ కూడా కొరత లేదని ప్రకటన చేస్తున్నా ప్రజల్లో మాత్రం పెట్రోల్ కొరత భయం పట్టుకుంది. అర్థరాత్రి వేళ కూడా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనదారులు, అదుపు తప్పిన ట్రాఫిక్, వినియోగదారుల ఆందోళనతో బంక్ ల వద్దకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్ బంక్ ల్లో నో పెట్రోల్ అనే బోర్డులు ప్రత్యక్షం అవుతుండడం వాహనదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఒకప్పుడు పెట్రోల్ బంక్ ల్లో గిరాకీ లేదని ఖాళీగా ఉన్న బంక్ లు ఉండగా ప్రస్తుతం చాలా చోట్ల బంక్ లు ఇంధనం లేక నోస్టాక్ బోర్డులను తగిలిస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై కేవలం డీజిల్ మాత్రమే లభ్యమయ్యే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల బంకుల్లో పెట్రోల్ లేదని తెలిసి వాహన యజమానులు ముందు జాగ్రత్తగా ఫుల్ ట్యాంక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎన్ జీకీ చాలా డిమాండ్ ఉంది. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో సంబంధిత వాహనదారులు గంటల తరబడి క్యూలో ఉండి గ్యాస్ నింపించుకుంటున్నారు.

. . . అసలేం జరిగింది ? భయమా.. వాస్తవమా?
దేశవ్యాప్తంగా రవాణా రంగంలో వస్తున్న మార్పులు లేదా సమ్మె పిలుపుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంధన సరఫరా నిలిచిపోవచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన జనం బంకుల వైపు పరుగులు తీశారు. కేవలం టూ వీలర్లే కాకుండా, ఆటోలు, కార్లు కూడా ఒకేసారి బంకులకు చేరుకోవడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాధారణంగా ఒక బంక్ లో రెండు మూడు రోజులకు సరిపడా నిల్వలు ఉంటాయి. కానీ ఒక్క రోజే అందరూ ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చూడటంతో నిల్వలు నిమిషాల్లో నిండుకుంటున్నాయి. అనవసరంగా స్టాక్ చేసుకోవడం వల్ల నిజంగా అత్యవసర పనులు ఉన్న వారికి, అంబులెన్స్ లకు ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. రేపు బండి బయటకు తీయాలంటే పెట్రోల్ ఉంటుందో లేదో తెలియదు. అందుకే రెండు గంటల నుంచి క్యూలో ఉన్నాను” అని ఒక సామాన్య వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆందోళనపై చమురు సంస్థలు లేదా స్థానిక యంత్రాంగం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడం ప్రజల్లో గందరగోళాన్ని మరింత పెంచుతోంది.

. . . రాష్ట్రంలో సరిపడా ఇంధన నిలువలు
. . . పెట్రోల్ , డీజిల్ కొరత లేదు : రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్, పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని, బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలో లీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. అంటే 652 కిలో లీటర్ల అదనపు నిల్వ మిగిలిందన్నారు. దీనికి తోడు అదనంగా 16,000 కిలోలీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతో పాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులు గందరగోళంలో పడి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతొ రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 25% పెరిగినా రోజువారీ సరఫరాలో సగటున పోల్చి చూసినపుడు కూడా ఎక్కడా అంతరాయం కలుగకుండా అదనంగా 22% అందుబాటులో ఇంధన వనరులు నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని పెట్రోలు బంక్ లకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చేరుకోక పోవడంతో ఆయా బంక్ లలో నో-స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయన్నారు. వాస్తవంగా మాత్రం ఎంత మాత్రం కొరత లేదని ఆయన పునరుద్ఘాటించారు. అయితే అదే సమయంలో షికార్లు చేస్తున్న పుకార్లను నమ్మి వినియోగదారులు కంటైనర్లలో, డబ్బాలలో, పెట్రోల్, డీజిల్ ని తీసుకెళ్లడం పూర్తిగా చట్టవ్యతిరేకమైన చర్య అని అంతకుమించి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. పెట్రోలియం నిలువలు రానున్న 65 రోజులకు సరిపడా ఉన్నాయని సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ఉండేలా నిరంతరం కొనసాగేందుకు వీలుగా ఓజీసీ లైన్ ను విస్తరించినట్లు ఆయన వెల్లడించారు.
