. రేషన్ దుకాణాల కేటాయింపులో ‘హస్తం‘ముద్ర
. లీడర్ల సతీమణులకు దుకాణాల అప్పగింత
. రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరుకాని వారికీ డీలర్ షిప్
.మండిపడుతున్న అర్హులు
నిజామాబాద్, బతుకమ్మ: రేషన్ దుకాణాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన అర్హుల ఆశలు గల్లంతయ్యాయి. ‘అభయ హస్తం’ ఉన్న వారికే డీలర్ షిప్ లు దక్కాయి. నిజామాబాద్ డివిజన్ లో రేషన్ దుకాణాల కేటాయింపులో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 27న నిజామాబాద్ డివిజన్ పరిధిలో 34 రేషన్ దుకాణాల కేటాయింపు కోసం రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 418 మంది దరఖాస్తు చేసుకోగా.. 393 మంది హాజరయ్యారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 3, 5తేదీల్లో నిజామాబాద్ లో ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితాను శనివారం రాత్రి ప్రకటించారు. జాబితాను చూసి పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు అవాక్కయ్యారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలను కేటాయించారనేది జాబితా చూస్తే స్పష్టమవుతోందని మండిపడుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నార్త్ మండలంలోని రేషన్ దుకాణం కాంగ్రెస్ అనుబంధ అధ్యక్షుడి సతీమణికి దక్కగా, అదే మండలంలోని మరో రేషన్ దుకాణం సైతం ఆ పార్టీ మరో అనుబంధ శాఖ అధ్యక్షుడి సతీమణికి అప్పజెప్పారు. మైనార్టీ ఏరియాలో ఏకంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరు కాని వారికి రేషన్ దుకాణాలు కేటాయించారనే ఆరోపణలున్నాయి. దక్షిణ మండలంలోని మరో రేషన్ దుకాణానికి ఐదుగురు ఇంటర్వ్యూకు రాగా, రాత పరీక్షకు హాజరుకాని అభ్యర్థికి కేటాయించారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. 36 రేషన్ దుకాణాలకు సంబంధించిన డీలర్ షిప్ ల కేటాయింపులో సింహభాగం హస్తముద్ర ప్రత్యక్షంగా కనబడుతోంది. ప్రధానంగా ఇద్దరు లీడర్లు చెప్పిన వారికే రేషన్ దుకాణాలు దక్కాయనే టాక్ నడుస్తోంది. రాత పరీక్షకు ముందు నుంచే పైరవీలు జోరుగా జరిగాయి. శనివారం రాత్రి తుది జాబితాను ప్రకటించారు. జాబితా ప్రకటించిన తర్వాతనే ఈ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ నాయకులు మాత్రం గప్ చుప్ గా ఉన్నారు.
