28.8 C
Hyderabad
Monday, August 3, 2026

డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ళను సైతం పరిశీలించిన కలెక్టర్, సీ.సీ టీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. బీ.ఎల్.ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సమాచార వివరాలతో కూడిన స్లిప్పులను వంద శాతం పంపిణీ చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మామిడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సదుపాయాల కల్పన విషయమై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని అన్నారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంతో అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలోని మూడవ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థులకు ఆంగ్లం సబ్జెక్టుపై కొద్దిసేపు బోధించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థులు సామర్ధ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లను కలెక్టర్ స్వయంగా చిన్నారులకు పంచిపెట్టారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, స్థానిక అధికారులు ఉన్నారు.

 

 

Collector visits distribution center and polling stations
Collector visits distribution center and polling stations

More articles

Latest article