27.3 C
Hyderabad
Friday, July 31, 2026

 సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

Must read

. . .  కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

భూభారతి రెవెన్యూ సదస్సులలో, అన్లైన్ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా భూభారతి పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. అర్జీల పరిష్కారంలో అలసత్వ వైఖరిని కనబరుస్తున్న పలువురు తహసీల్దార్లపై కలెక్టర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకునే వరకు చూడవద్దని, ఇప్పటికైనా దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సాదాబైనామా ద్వారా భూములు కొనుగోలు చేసిన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరేలా ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు తు.చ తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఒకవేళ ఏవైనా దరఖాస్తులు  తిరస్కరణకు గురైతే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని, అవి సహేతుకమైనవి అయి ఉండాలని అన్నారు. కాగా, సబ్ కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు పంపించబడే అర్జీలను వెంటదివెంట  పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. తదుపరి సమీక్ష నిర్వహించే నాటికి సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

Plaintiffs' applications should be resolved promptly.

- Advertisement -spot_img

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest article