27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డిఫాల్టర్ రైసుమిల్లులో విజిలెన్స్ తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

  • వర్ని మండలంలో రైసుమిల్లులో సోదాలు
  • 28 బస్తాల ముక్కిన బియ్యం స్వాధీనం

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో మరోసారి పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలను ప్రారంభించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ అప్పగించడంలో విఫలమైన వారి మిల్లులలో తనిఖీలకు ఆదేశాలు రావడంతో సోదాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 39 నుంచి 41 రైసుమిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపు 200 కోట్ల బియ్యం ఎఫ్ సిఐకు అందించకపోవడంతో ఆనాడు కేసులు నమోదైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మరోసారి మిల్లులలో తనిఖీలకు అధికారులు ఆదేశాలివ్వడం జరిగింది. 2025-26 వానకాలం సీజన్ కు సంబంధించిన ధాన్యం కేటాయింపులు జరిగిన తర్వాత సోదాలు జరుగడం కలకలం రేపింది. డిఫాల్టర్ కోసమని బుధవారం విజిలెన్స్ చీఫ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా వర్నిమండలంలో వసీ రైసుమిల్లులో సోదాలు నిర్వహించారు.ఈ సోదాలలో 25 బస్తాల ముక్కిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత రైసుమిల్లు కూడా డిఫాల్టర్ జాబితాలో ఉండడం గమనార్హం.

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిఫాల్టర్ రైసుమిల్లులో సోదాలు..

తెలంగాణలో అత్యధికంగా వరిని పండించే జిల్లాలో సేకరణలోనూ ముందుండే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మిల్లర్లు సీఎంఆర్ అప్పగింతలో నిర్లక్ష్యం కొనసాగుతుంది. వందల రైసుమిల్లులు ఉండగా బడాబాబులు, లీడర్లకు సంబంధించిన, అసోసియేషన్ నాయకులకు సంబంధించిన మిల్లుల నుంచే ఎఫ్ సిఐకి సీఎంఆర్ అందలేదు. గత మూడు సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగాలు గడువు పెంచుతూ వస్తున్నా మిల్లర్లలో చలనం లేదు. కొన్ని రైసుమిల్లులకు జరిమానా విధింపుతో పాటు రెవెన్యూ రికవరి యాక్టు కేసులు నమోదు చేసినా ఫలితం లేకపోయింది. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి అధికార యంత్రాంగం చర్యలను అడ్డుకుంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బోధన్, నిజామాబాద్, కామారెడ్డి డివిజన్ లలోనే అత్యధికంగా సీఎంఆర్ డిఫాల్టర్లు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ కేటాయింపులు, రికవరిలో బాధ్యులను అప్పటి అదనపు కలెక్టర్ తో పాటు తహసీల్ధార్లపై కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ రికవరిలో నిర్లక్ష్యం చేశారని నిజామాబాద్ డీఎస్ వో, డీఎంలను బదిలీ చేశారు. అది అలా జరిగినప్పటికీ రికవరిలో ఏ మాత్రం పురోగతి లేకపోవడంతో మరోసారి డిఫాల్టర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు సిద్దమైంది. అందులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

More articles

Latest article