28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నేరపూరిత ఉద్దేశ్యంతో ఒకరి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి,ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి,మహిళను గాయపరచి,కులంపేరుతో దూషించిన ముద్దాయి కొట్టొల్ల కార్తిక్ కు ఆయా నేరాలలో జైలుశిక్షలు విధిస్తు నిజామాబాద్ షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు బుధవారం చెప్పారు.అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్ ప్రాంతంలో నివాసం ఉండే కార్తీక్ ,రామదాసు అనే వ్యక్తి తనకు మూడు వేలు రూపాయల చేతిబదులు తీసుకుని ఇవ్వలేదనే కోపంతో 03 ఆగస్టు,2023 న రాత్రి సమయంలో గాజులపేట్ లోని వారి ఇంటి దగ్గరికి వెళ్లి రామదాసు లేడా అంటు ఇంటి తలుపులు తన్ని నష్ట పరిచి,ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించాడు.రామదాసు తల్లి హనవతే ఇందిరా భాయి తన కుమారుడు ఇంటిలో లేడని పొద్దున ఆటో రిక్షా తీసుకువెళ్లి రాలేదని తెలిపిన వినకుండా ఇంటిలోని సామాను ధ్వంసం చేసి ఆమెను గాయపరచి,షెడ్యూల్డు కులంపేరుతో దూషించాడు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకట రెడ్డి పై నేరారోపణ లపై పూర్తి స్థాయిలో నేర విచారణ జరిపి సాక్ష్యాధారాలతో కూడిన అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణ చేసిన కోర్టు మొత్తం పదకొండు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఏడు దృవీకరించుకున్న పత్రాలను ,వస్తుగత సాక్ష్యాన్ని మార్క్ చేసుకుని ముద్దాయి కొట్టొల్ల కార్తిక్ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించడం,ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేయడం, ఇందిరా భాయి ని కత్తెతో గాయపర్చడం,షెడ్యూల్డు కులంపేరుతో దూషించడం అనే నేరాలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపితం అయినట్లు నిర్ధారిస్తు ఆయా నేరాలకు గాను శిక్షలను ఖరారు చేశారు. నేర పూరిత ఉద్దేశ్యంతో ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించినందుకు గాను మూడేళ్ళ కఠిన కారాగార శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమాన విధించారు. జరిమానా చెల్లించనిచో అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు.ఇందిర ను గాయపరచినందుకుగాను ఒక సంవత్సరం,ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేసినందుకు ఒక సంవత్సరం, నేర పూరిత ఉద్దేశంకు గాను ఒక సంవత్సరం చొప్పున జైలుశిక్షలతో పాటు వేయి రూపాయల జరిమాన విధించారు.  షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం లోని మరో మూడు సెక్షన్ల ప్రకారం ఆరు నెలల చొప్పున జైలుశిక్షలను ఖరారు చేశారు. శిక్షలన్ని ఏకకాలంలో అనుభవించాలని స్పెషల్ జడ్జి శ్రీనివాస్ తమ ఇరవై రెండు పేజీల తీర్పులో వ్రాశారు.

More articles

Latest article