27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద కొనసాగుతున్న రిజర్వాయర్ పనులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. నీటి ప్రవాహాలతో కూడిన వాగులు, ఎత్తైన కొండ ప్రదేశాలను కాలి నడకన దాటుతూ, రిజర్వాయర్ బండ్ నిర్మిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్లూయిస్ ల నిర్మాణానికి అవసరమైన స్థలం  విషయమై రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం నెలకొని ఉన్న ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. టోపో షీట్, గూగుల్ మ్యాప్ ల ఆధారంగా స్థల నిర్ధారణ కోసం రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థల వివాదానికి సంబంధించిన అంశాలపై తన వెంట ఉన్న బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ఇతర అధికారులతో చర్చించారు. పరస్పర సమన్వయంతో సర్వే పూర్తి చేయాలని ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. స్లూయిస్ ల నిర్మాణానికి అటవీ భూమి అవసరం అయిన పక్షంలో భూసేకరణ, అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. అప్పటి లోగా రిజర్వాయర్ కు సంబంధించిన ఇతర పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈ.ఈ రాజశేఖర్, ఎఫ్.డీ.ఓ సుధాకర్, తహసీల్దార్ సాయిలు తదితరులు ఉన్నారు.

Collector inspects Siddapur reservoir works

More articles

Latest article