- కాంగ్రెస్ కు కరప్షన్ గనిగా మారిన సింగరేణి
- హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ: కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడుతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కరప్షన్ గనిగా మారిందని విమర్శించారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత మధ్య కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ.. హెచ్ఎంఎస్ కార్మిక సంస్థ సుభాష్ చంద్రబోస్ పెట్టిన సంస్థ అని, బ్రిటీష్ హయాంలో కార్మికుల కోసం పోరాడడానికి ఏర్పాటు చేసిన సంస్థ అని, అది ఇక్కడ స్వతంత్రంగా పనిచేస్తోందని వివరించారు. హెఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అనేక కార్మిక ఉద్యమాలు చేపట్టారని, సింగరేణి కార్మికుల కోసం కొట్లాడి అధిక బోనస్ సాధించడంలో కీలక పాత్రపోషించారని కొనియాడారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి జాగృతి కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు కలిసి పనిచేయాల్సిందేనని వివరించారు. ఉద్యోగ నియామకాలతో సహా అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ సింగరేణిలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ అవినీతి పెరిగిందని స్పష్టం చేశారు. కాబట్టి సింగరేణి సంస్థ కేంద్ర విజిలెన్స్, సీబీఐ పరిధిలోకి వచ్చే విధంగా సంస్థ మారాలని అభిప్రాయపడ్డారు. ప్రశ్నిస్తే ఉద్యోగాలను తీసేసే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, దానికి అడ్డుకట్టవేస్తామని తేల్చిచెప్పారు. సింగరేణి ప్రాంతం మినీ ఇండియాగా మారిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కలకలలాడుతోందని అన్నారు. ఏటా ఐదు గనులు తెరిచినా కూడా 185 గనులు తెరిచేంత బొగ్గు నిల్వలు తెలంగాణ భూగర్భంలో ఉన్నాయని చెప్పారు. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మ్యాన్యువల్ గనులను తెరవాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ వల్ల పెద్ద వాళ్లకే లాభమవుతుందని, పైగా కాలుష్యం తీవ్రమవుతోందని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తామని తెలిపారు. కార్మికుల హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురి చేసిందని, లాభాల్లో 33 శాతం వాటా బోనస్ గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు ఏడాది దసరాకు బోనస్ గా లాభాల్లో 37శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

