- విద్యాశాఖలో అడ్డగోలుగా డిప్యూటేషన్లు
- గెస్ట్ లెక్చరర్లు ఉన్న డైట్ లో బోధనకు ఉపాధ్యాయులకు పోస్టింగ్
- ఎమ్మెల్యేలకు తెలియకుండానే నియోజకవర్గాలు దాటించిన వైనం
- ఉపాధ్యాయ సంఘాల నేతల జోరుగా పైరవీలకు విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్
- డిప్యూటేషన్లకు కాసుల వసూళ్ల కళంకం
నిజామాబాద్, బతుకమ్మ :
జక్రాన్ పల్లి మండలం ఒక ఎంపియూపిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ను నిజామాబాద్ నగరంలోని దక్షిణ మండలం హైస్కూల్ కు డిప్యూటేషన్ వేశారు. కమ్మర్ పల్లి మండలంలోని ఒక సరిహద్ధు గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ ను దాదాపు 45 కిలో మీటర్ల దూరంలో జిల్లా కేంద్రంకు డిప్యూటేషన్ పై పంపారు. ధర్పల్లి మండలంలో పనిచేస్తున్న ఒక స్కూల్ అసిస్టెంట్ ను నిజామాబాద్ రూరల్ మండలంకు 30 కిలో మీటర్ల దూరంలో డిప్యూటేషన్ వేశారు. బోదన్ పట్టణంలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలిని నిజామాబాద్ నగరానికి వర్క్ అడ్జస్ట్ పేరుమీద పంపారు. కమ్మర్ పల్లి , భీంగల్ సరిహద్ధులోని ఒక ఉపాధ్యాయుడిని మాక్లూర్ మండలం కు పంపారు. మాక్లూర్ మండలంలోని ఒక పండితురాలిని మోపాల్ మండంలోని జడ్పీ స్కూల్ కు డిప్యూటేషన్ వేశారు. ఈ నెల 28న ఉత్తర్వు సంఖ్య 1430 పేరుమీద 15 మందికి డిప్యూటేషన్ వేస్తే అందులో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని సర్క్యూలర్ లో వెల్లడువుతుంది.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి పేరున ఈ నెల 28న వెలువడిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్ వ్యవహారం విద్యాశాఖలో ప్రకంపనలు రేపుతోంది. వర్క్ అడ్జస్ట్ మెంట్ అవసరమైన స్కూళ్లకు అనే పేరుమీదా 15 మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ వేయడంపై జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయులే ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ పేషికి సమాచారం అందించి జరిపిన డిప్యూటేషన్ లు ఏకంగా స్థానికంగా పాఠశాలకు సమీపంలో కాంప్లెక్స్ పరిధిలో జరుగాలి. అదీ కాదు అంటే స్థానికంగా మండలంలోని స్కూల్స్ కు అవసరమైన బోధకులను జరుపాలి. అదీ కాదు అత్యవసరం అంటే పక్కన ఉన్న మండలంలో డిప్యూటేషన్ వేయాలి. కాని ఏకంగా నియోజకవర్గాలను దాటించి జిల్లా కేంద్రంకు, రూరల్ మండలం కు బదిలీ చేయడంతో ఇలాంటి బదిలీలు ఎప్పుడు జరుగలేదని సర్కార్ టీచర్ లు చెపుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ లను కాకుండా ఎస్ జిటిలను కూడా డిప్యూటేషన్ లు వేయడంతో ఉపాధ్యాయులు ఖంగు తిన్నారు. వైద్య పరంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నావారు పదుల సంఖ్యలో తమకు డిప్యూటేషన్ వేయాలని దరాఖాస్తులు చేసుకుంటే అవి బుట్టదాఖలు అయ్యాయని చర్చ జరుగుతుంది.
ఉపాధ్యాయుల డిప్యూటేషన్ కు ఉన్న నిబంధనలు ఏమిటి అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో ఖాళీలు ఉన్నాయని ఏకంగా ఓరల్ డిప్యూటేషన్ లు విద్యాశాఖలో కొత్త చర్చకు దారి తీసింది. జిల్లా విద్యాశాఖాదికారి డైట్ కళాశాలలో పనిచేస్తు ఇంచార్జీ డిఇఓగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అదే కళాశాలలో ఉర్ధు మీడియంలో బోదించడానికి అర్హులైన ఉపాధ్యాయులు లేరని డిప్యూటేషన్ లు అది పాఠశాలల నుంచి వేయడం వివాదాస్పదంగా మారింది . ప్రధానంగా గడిచిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో సంబంధిత సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయిన పాఠశాలల స్కూల్ అసిస్టెంట్ లను డైట్ కళాశాలకు డిప్యూటేషన్ వేయడం గమనార్హం. ఇదిలా ఉండగా ఏకంగా డిప్యూటేషన్ లకు ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడం, నోటి మాటగా పోస్టింగ్ లు ఇవ్వడం ఏమిటని చర్చ జరుగుతుంది. కొందరు ఉపాధ్యాయులు తాము పనిచేసిన చోట గైర్హాజరు అవుతు జిల్లా కేంద్రంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు అనే చర్చ జరుగుతుంది.
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ చేపట్టిన డిప్యూటేషన్ ల వ్యవహారం కలకలం రేపుతుంది. ఏకంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఉపాధ్యాయులను కదిపారని తెలిసింది. జిల్లా విద్యాశాఖా అధికారులు, కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతల ప్రోద్బలంతో ఈ వ్యవహరం జరిగిందని చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎవ్వరు కుడా తమ ప్రాంతంలోని పాఠశాలలో విద్యా బోదన చేస్తున్న ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్ మెంట్ పేరుతో ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేయడం తెలియదని అంటున్నారు. కొన్ని పేరు మోసిన ఉపాధ్యాయ సంఘాల లీడర్లు కాసులకు పైరవీలు చేసి అడ్జస్ట్ పేరిట డిప్యూటేషన్ లు వేయించారని ఆరోపణలు వస్తున్నారు. ఈ వ్యవహరంలో విద్యాశాఖా కార్యాలయం వేదిక కావడంపై విమర్శలు వస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేయడం అవసరం లేకపోయిన హెడ్ క్వార్టర్ లో చేయడం కోసం పోస్టింగ్ లు వేయించుకున్నారని అక్కడ గెస్ట్ లెక్చర్ లు ఉండగా డైట్ లో డిప్యూటేషన్ వేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
