24 C
Hyderabad
Sunday, August 2, 2026

స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించే సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం (PC PNDT Act 1994 and rules 1996)పై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యూవల్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ స్కానింగ్ కేంద్రంలో అయినా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు ఆడ లేదా మగా అని లింగ నిర్ధారణ చేస్తే, పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాంటి సెంటర్ల అనుమతులు రద్దు చేయాలని, అవసరమైతే సీజ్ చేయాలని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలను ప్రోత్సహించిన వారికి, అందుకు సహకరించిన వారికి కూడా చట్ట ప్రకారం జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుందని అన్నారు.       కాగా, ప్రతి స్కానింగ్ సెంటర్ లో నిర్ణీత రుసుము ను మాత్రమే వసూలు చేయాలని, చార్జెస్ గురించి తెలియజేసేలా పట్టికను ప్రతి సెంటర్లో విధిగా ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలన్నీ రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, అలా చేయని వారికి రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ చేయకూడదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యల నివారణ కోసం ఉద్దేశించిన చట్టాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తూ, ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. ఆడపిల్ల ప్రాధాన్యతపై, బేటీ బచావో బేటి పడావో పై, పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామ, మండల స్థాయి సమాఖ్య సమావేశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగే అమ్మ ఒడి కార్యక్రమాల్లో, నెలవారి సమావేశాల్లో, ఆశాలు గృహ సందర్శనలో, ఐకెపి, మెప్మా, డీఆర్డీఏ సమావేశాలలో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, లీగల్ సెల్ ప్రతినిధి జి.రవిప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More articles

Latest article