- పిల్లల్ని స్కూల్ కు పంపొద్దంటున్న స్కూల్ యాజమాన్యాలు
- ఆందోళనలో తల్లిదండ్రులు
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని, విద్యార్థులకు కార్పొరేట్ విద్యను ప్రయివేట్ స్కూళ్లల్లో ఉచితంగా ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన బెస్ట్ అవైలేబుల్ స్కూల్ స్టూడెంట్ల పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. పాఠశాలలు ప్రారంభం అయ్యాయి పిల్లల్ని స్కూల్ కు పంపించాలని స్కూల్ కు వెళ్తే మీ పిల్లల్ని స్కూల్ పంపొద్దు మాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని, బెస్ట్ అవైలబులు స్కూల్స్ యజమానులు ఖరాఖండిగా చెపుతున్నారు. పిల్లల్ని స్కూల్ కు కొంచం లేట్ పంపుదామని ఇంటి వద్దనే ఉంచుకొన్న పిల్లల తల్లిదండ్రులకు సైతం స్కూల్ యజమానులు ఫోన్ చేసి మీ పిల్లల్ని స్కూల్ కు తీసుకురావద్దని, పంపొద్దని,ఇప్పటి వరకు మీ పిల్లలకు సంబందించిన డబ్బులు ప్రభుత్వం నుండి ఇంకా రాలేదని చెబుతున్నారు. మాకు రావాల్సిన బకాయి ఫీజులు ప్రభుత్వం చెల్లించే వరకు మీ పిల్లల్ని స్కూల్ కు తీసుకురావద్దని తెగేసి చెబుతున్నారు. వేసవి సెలవుల అనంతరం జిల్లాలో అన్ని ప్రయివేట్, ప్రభుత్వ స్కూల్ ప్రారంభమై పిల్లలు స్కూళ్లకు వెళ్తుంటే తమ పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నారని, వాళ్ల చదువు, వాళ్ల భవిష్యత్ ఏంటని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్ల (బీఏఎస్)తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు అయినా తన పిల్లలు ఇంటివద్దనే ఉంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి నిధులు రావట్లేదని, స్కూళ్ల నిర్వహణ కష్టంగా మారిందని స్కూల్ యజమానులు చెబుతున్నారు.ఈ విద్యా సంవత్సరం స్కూల్ నడపాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు తల రూ. 20వేలు ఫీజు చెల్లించాలని చెబుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజు కట్టి చదివించే స్థోమత మాకుంటే బీఏఎస్ స్కీం లో మా పిల్లల్ని ఎందుకు చదివిస్తామని, మంచి కార్పొరేట్ స్కూల్లాలోనే చదివించే వారమని తల్లిదండ్రులు అంటున్నారు. మా పిల్లల్ని స్థానికంగా గవర్నమెంట్ స్కూల్ లోనే చదివించుకొంటామని, మా పిల్లల టీసీ, బోనఫాయిడ్ లు ఇవ్వాలని స్కూల్ యజమానులను అడిగితే బకాయి ఫీజులు వచ్చే వరకు టీసీ, బోనఫాయిడ్ లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. స్కూల్ లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంలో మా స్కూల్ నడపలేమని, మీ పిల్లలకు విద్యా భోధన చెయ్యలేమని లిఖిత పూర్వకంగా వ్రాసి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే రాసివ్వమని, మీరు కావాలంటే వెళ్లి కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చుకొండని స్కూల్ యాజమాన్యాం తెగేసి చెప్పారని తల్లిదండ్రులు అంటున్నారు. ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. తమ పిల్లల భవిష్యత్ తో ఆడుకుంటే ఎంతకైనా సిద్దమేనని, కలెక్టర్ కాదు అవసరమైతే ముఖ్యమంత్రి వరకైనా వెళ్ళడానికి తాము సిద్దమేనని పిల్లలు తల్లిదండ్రులు అంటున్నారు. ఈ విషయమై పేరెంట్స్ సోమవారం కలెక్టరేట్ ను ముట్టడించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ బకాయి నిధులు, విద్యార్థుల భవిష్యత్ పరిస్థితులను గురించి తెలుసుకొనేందుకు బతుకమ్మ ప్రతినిధి డిస్ట్రిక్ట్ ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిషనల్ డైరెక్టర్ కు పలుమార్లు ఫోన్ చేసిన స్పందించలేదు.
