29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్, బతుకమ్మ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. డిచ్పల్లి మండలం సుద్దులం, దర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామాలలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటికే మెండోరా మండలంలో పైలెట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులు జరిపి, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని మిగతా 32 మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ల నేతృత్వంలో రెండు బృందాలను నెలకొల్పి, ప్రతి రోజు ప్రతి మండలంలో రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులలో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్టు 14వ తేదీ లోపు భుభారతి కింద వచ్చిన అన్ని అర్జీలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు.  నిర్ణీత షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, తహశీల్దార్లు సతీష్ రెడ్డి, శాంత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Revenue conferences should be taken advantage of.

More articles

Latest article