- ఖచ్చితత్వాన్ని పాటించాలి
- అధికారులకు బోధన్ సబ్ కలెక్టర్ ఆదేశాలు
బతుకమ్మ, బోధన్ : బోధన్ డివిజన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో సోమవారం వర్ని, కోటగిరి మండలాల్లోని ఇందిరమ్మ ఇండ్లు సర్వే పురోగతిని సమీక్షించారు. ఎంపీఓ కోటగిరి, ఎంపీడీఓ వర్నిలతో కలిసి, ఆయన వర్ని మండలంలోని పొట్టి గుట్ట తండా మరియు కోటగిరి మండలంలోని జల్లెపల్లి, కల్లూరు గ్రామాలకు క్షేత్రపర్యటన నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్-కలెక్టర్ వికాస్ మహతో గ్రామాల్లో క్షేత్ర సిబ్బందితో ప్రత్యక్షంగా ముచ్చటించారు. సర్వే ప్రక్రియలో సేకరిస్తున్న డేటాను పరిశీలించి, ప్రామాణికంగా ఉండేలా మార్గదర్శనాలు అందించారు. ప్రతి ఇంటి వివరాలను సక్రమంగా నమోదు చేసి, బాధితులకు హక్కులు లభించేలా సర్వే నిర్వహించాలన్నది ఆయన ఆదేశం. సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సబ్-కలెక్టర్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత, సమర్థత కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

