- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
రుద్రూర్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి’ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఆర్.ఓ.ఆర్ చట్టం ఉపకరిస్తుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి నూతన చట్టంపై రైతులకు శనివారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పాల్గొని భూభారతి చట్టంపై, అందులోని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం చారిత్రక మార్పు దిశగా ఈ నూతన ఆర్ఆర్ చట్టం ఉపకరిస్తుందని, రైతుల భూములకు భరోసా లభిస్తుందని సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి వెసులుబాటు కల్పించే ఈ చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, భూ సమస్యలు కలిగిన రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నాలుగు మండలాలలో దీనిని ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇతర ఏవైనా అంశాలు, సమస్యలను కూడా పరిశీలించి ఈ చట్టంలో చేర్చడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మే మొదటి వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి చట్టాన్ని అమలు చేస్తారని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి నూతన చట్టంపై సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించి పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ, అధికారులే గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని పరిష్కరిస్తారని అన్నారు. భూ వివాదాల విషయంలో అప్పీలు చేసుకున్న పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం సమకూరుస్తారని సూచించారు. ఈ చట్టం ప్రవేశపెట్టిన ఏడాది కాలం లోపు భూ సంబంధిత సమస్యలపై అర్జీలు పెట్టుకునే అవకాశం కల్పించారని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల వ్యవస్థ ఉంటుందని, ఈ చట్టం ద్వారా రైతులకు వారి భూముల వివరాలతో కూడిన భూధార్ కార్డులను కేటాయిస్తారని తెలిపారు.వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర, మిగితా అన్ని రకాల భూముల రికార్డులు రెవెన్యూ కార్యాలయంలో నమోదు అయి ఉంటాయని అన్నారు. ఇదివరకటి ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని, భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే అప్పిల్ వ్యవస్థ లేదని సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎస్ఏ స్థాయిలలో అప్పీల్ వ్యవస్థ ఉందని, ప్రతి అంశం భూభారతి పోర్టల్ లో ఉంటుందని, ఎవరైనా వారి భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అడిషనల్ కలెక్టర్ కిరణ్, బోధన్ ఏసీపి శ్రీనివాస్, తహసీల్దార్ తారాబాయి, రుద్రూర్ ఎస్సై పి.సాయన్న, వివిధ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

