- గ్రామాలపై ఆధిపత్యం కోసమే
- దుర్కి గ్రామ మత్తుకల్లు ఉదంతంలో వెలుగు చూస్తున్న నిజాలు
- దుర్కి ఘటనలో మూడు గ్రామాల ప్రజల అస్వస్థత
- ఒకవైపు ఆసుపత్రులలో ప్రజలకు వైద్యం.. మరో వైపు అమ్మకాలు
నిజామాబాద్, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోకృత్రిమంగా నిషేధిత మత్తు పదార్థాలతో తయారైన కల్తీ కల్లు తాగిన 20 మంది అస్వస్థతకు గురికాగా బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కి తరలించిన విషయం తెలిసిందే. అందులో మెరుగైన వైద్యం కోసం 8 మందిని తెలంగాణలో హైద్రాబాద్ తరువాత ఎకైక డి అడిక్షన్ సెంటర్ కలిగిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అందులో 60 సంవత్సరాల లింబవ్వ పరిస్థితి విషమంగా ఉండగా, కల్తీ కల్లు తాగిన 7 వతరగతి విద్యార్థి ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం వెలుగు చూసిన కల్తీకల్లు బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మంగళవారం బాన్స్ వాడ జిల్లా ఆసుపత్రి లో 58 మందికి వైద్యం అందిస్తున్నారు. 13 మందిని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
దుర్కిలోని కల్లుడిపోను సీజ్ చేశారు అబ్కారీ అధికారులు. కృత్రిమ రసాయనిక పదార్థాలతో తయారీ కల్లు తాగి బీర్కూర్, అంకోల్, దామరాంచ గ్రామస్తులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ యథావిధిగా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. దుర్కి గ్రామంలో కృత్రిమ కల్లు తాగి ప్రజలు ఆసుపత్రుల పాలైన ఇతర గ్రామాలలో కృత్రిమంగా నిషేధిత మత్తుపదార్థాలతో కల్లు తయారీ ఆగలేదు. అమ్మకాలు ఆగలేదు.. కేవలంలో దుర్కిలో మత్తు మోతాదు మించింది.. మిగితా గ్రామాలలో అస్వస్థత లేదు కాబట్టి ఆయా గ్రామాల వైపు అబ్కారీ, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. బాన్స్ వాడ ఆసుపత్రి లో మత్తు కల్లు బాధితులను ప్రభుత్వ సలహదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. కల్లుతో ప్రజలు అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం అన్నారు. కల్తీ కల్లు పై ఉక్కుపాదం మోపాలని ఎక్సయిజ్ అధికారులకు ఆదేశం జిల్లా ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితుల ఆరోగ్య పరిస్తితిపై సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆరా తీశారు.
దుర్కిలో కృత్రిమంగా కల్లు తయారీ, అమ్మకాల విషయంలో సొసైటీలు, లైసెన్స్ కలిగిన కార్మికుల మధ్య ఆదిపత్య పోరు నడుస్తుందని సమాచారం. సోమవారం ఒక్కరోజు 58 మంది అస్వస్థతకు గురికావడానికి మత్తు పదార్థాల వినియోగం మోతాదు మించినట్లు తెలిసింది. ప్రధానంగా కల్లుకు సహజంగా ఉండే మత్తు ఆధారంగా అమ్మకాలు జరుగుతుండటంతో నిషేధిత మత్తు పదార్థాలను కలిపి విక్రయాలు జరుపుతున్నారు. ఎక్సైజ్, పోలీస్ శాఖలకు మామూళ్లు అందిస్తామని తమను ఎవ్వరు ఎమీ చేయరని, ల్యాబ్ లలో అల్ప్రజోలం వాడిన బహిర్గతం కాదనే ధీమాతోనే బరితెగించినట్లు తెలిసింది. దుర్కిలో కృత్రిమ తయారీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన నసూరుల్లాబాద్ తో పాటు చుట్టు పక్కల మండలాలల్లో గ్రామాలలో నిషేధిత మత్తు పదార్థాలను కలిపి కల్లు తయారు చేయడం విక్రయాలు జోరుగా సాగడం గమనార్హం.

