- కింగ్ కోఠి టూ ఆర్మూర్
- విస్తరించిన బైక్స్ స్కాం
- కోఠిలో చోరీ డ్రామా.. ఇతర ప్రాంతాల్లో విక్రయాలు
- ఆర్మూర్ డిజన్ లో 32 బైకులు సీజ్
- అమాయకులకు అంటగడుతున్న కేటుగాళ్లు
- రాజకీయ రంగు పులుముకున్న చోరీ బైక్ ల క్రయ విక్రయాలు
ఆర్మూర్, బతుకమ్మ: హైదరాబాద్ లోని కింగ్ కోఠి కేంద్రంగా కొనసాగుతున్న బైక్ స్కామ్ మూలాలు ఆర్మూర్ లో వెలుగు చూస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు స్కామ్ కొనసాగుతున్న తీరు ఇలా ఉంది.. కొందరు వ్యక్తులు వివిధ సంస్థలకు చెందిన బైకులను విక్రయించే ఏజెన్సీలను కింగ్ కోఠీలో ఏర్పాటు చేసి సదరు కంపెనీల నుంచి కొత్త బైకులను కొంటారు. అనంతరం వాటిని నిబంధనల ప్రకారం వినియోగదారులకు విక్రయించకుండా ఆ బైకులు చోరీకి అయ్యాయని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తారు. ఆ బోగస్ ఏజెన్సీల మాటలు నమ్మి పోలీసులు కేసులు నమోదు చేస్తారు. ఆ కేసులకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా బోగస్ సంస్థలు ఎన్ని బైకులు చోరీకి గురైనట్టు చిత్రీకరిస్తారో అన్ని బైకులకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు. అనంతరం ఆ బైకులు ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తూ మరోమారు సొమ్ము చేసుకుంటున్నారు.
తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఠాలు ఈ దందాను పక్కాగా నడిపిస్తూ బైకులను సగం ధరలకే అమ్ముకోవడం, మరి కొన్ని బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ బైకులను ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వాటిని విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున దొంగ బైకులు వెలుగు చూడగా పోలీసులు సీజ్ చేశారు. అంకాపూర్ లో 5, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్ లో 2, మైలారంలో 15 దొంగ బైకులను పోలీసులు సీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అమాయకులను నిలువునా ముంచుతున్న మాఫియా ఆగడాలు ఆర్మూర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతుండగా ఈ వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ.30 వేల మొదలుకోని రూ.50 వేలకు కొత్త మోడల్ బైక్ లు వస్తుండటం వాటిని తెలిసిన వారే ఇస్తుండటంతో వాటిని కొని అమాయాకులు ఆ ఉచ్చులో చిక్కుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ లీడర్ల మద్య ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని టార్గేట్ చేస్తు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టింగ్ లతో పాటు ఏకంగా పోస్టర్లను వేసింది. తాజాగా కింగ్ కోఠి కేంద్రంగా వెలుగు చూసిన బైక్ స్కామ్ కేసులో అమాయకులకు బైక్ లను తక్కువ ధరకు అంటగట్టిన వారిలో బీజేపీ కార్యకర్తల పేర్లు బహిర్గతమయ్యాయి. పోలీసులు నెంబర్ ప్లేట్ లేని బైక్ ల సీజ్ సమయంలో ఈ వ్యవహరం వెలుగు చూసినట్లు తెలిసింది. బీజేపీ ముఖ్య లీడర్ల ఉండంటతో వారిని కాపాడేందుకు పోలీస్ శాఖాపై ప్రజా ప్రతినిధి ఒత్తిడిపై బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. దీని వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి ఉన్నారని మరో మాజీ ప్రజాప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యక్తులు కింగ్ కోఠి కేంద్రంగా బైక్ ల స్కామ్ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తమకు దొంగ బైక్ లు అంటగట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని మరో వైపు బాధితులు కోరుతున్నారు.
