23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

 

నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆర్మూర్ శివారులోని చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్.ఓలు, ఏ.ఆర్.ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చట్టబద్ధతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాల్సి ఉంటుందని, నియమ, నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించగల్గుతారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకళింపు చేసుకోవాలని, ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్ బుక్ (కర దీపిక) ను చదువుకుని ఈ.సీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరువాల్సి ఉంటుందని, ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరుపాలని ఈ.సీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియలను ఈ.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. సమయ పాలనను పక్కాగా పాటిస్తూ, నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా, వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బ్యాలెట్ పేపర్ లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించాల్సి ఉంటుందని, ఓటరు జాబితాలోని అభ్యర్థి పేరును అక్షరక్రమం కోసం పరిగణలోకి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే, అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి, అందుకు గల కారణాలు ఏమిటీ అనే అంశాలను వెల్లడించాల్సి ఉంటుందని అన్నారు. వెంటదివెంట డైలీ రిపోర్టును పంపించాలని, సంబంధిత వెబ్ సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు “నోటా” సింబల్ ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి ఆక్షేపణలు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి,  డీఎల్పీఓ ఏ.శివకృష్ణ, ఆర్.ఓలు, సహాయ ఆర్.ఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Duties should be performed in accordance with the election rules

More articles

Latest article