నిజామాబాద్, బతుకమ్మ: ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఓటర్ల సంఖ్య వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, స్థానిక అధికారులు ఉన్నారు.
ఎడపల్లి పీహెచ్ సీ తనిఖీ
బోధన్ పట్టణానికి వెళ్లే ముందు కలెక్టర్ హనుమంతు ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

