26.3 C
Hyderabad
Monday, August 3, 2026

విజయ’ డెయిరీ అస్తవ్యస్తం 

Must read

📰 Generate e-Paper Clip

  • రెన్యూవల్ లేదు – ఎన్నికలు లేవు
  • సొసైటీలు లేకుండానే పాల కేంద్రాలు 
  •  మళ్ళీ కొత్తగా  రిజిస్ట్రేషన్లు చేయాల్సిందే 
  • గత అధక్షుల సంతకాలతోనే బిల్లులు డ్రా

హైదరాబాద్ బతుకమ్మ: దేవుడు వరమిచ్చిన పూజారి కనురించడు అన్నట్లుగా ఉంది విజయ డెయిరీ పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇచ్చి, ప్రోత్సహిస్తున్నా నిర్వహణను అధికారులు  అస్తవ్యస్తం చేస్తున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సొసైటీలకు ఎన్నికలు జరిపించి కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఇంతవరకు ఎన్నికలను జరిపించలేకపోయారు. గత  అద్యక్షుల సంతకాలనే డెయిరీ మేనేజర్లు ఉపయోగించుకుంటున్నారు.  పాలక వర్గం లేకపోవడంతో రైతులలో అనాసక్తి పెరగినట్లు కనబడుతోంది. దీనివల్ల సంస్థకు పాలు పోయకుండా ప్రైవేట్ వైపు వెళ్తున్నారనే విషయాన్ని గమనించవచ్చని రైతులు పేర్కొంటున్నారు.

  • సొసైటీలు లేకుండానే: 

పాల సేకరణ కోసం సొసైటీలే కీలకం.  కేంద్రం నెలకొల్పిన ప్రాంతంలో సొసైటీ కార్యవర్గం ఉన్నట్లయితే అక్కడ ఉత్పత్తి అవుతున్న పాలన్ని కేంద్రానికి చేరే అవకాశం ఉంటుంది. గతంలో ఈ విధానం బాగున్నా నిర్లక్ష్యం చేయడంతో నిర్వహణ కుంటుపడిందని  చెప్పవచ్చు. తెలంగాణా వ్యాప్తంగా సుమారు 2500 వరకు సొసైటీలు ఉంటాయి. గేదెలు, ఆవులు ఉన్న రైతులకే కార్యవర్గంలో స్థానం ఉంటుంది. వీరు సంస్థకు, రైతులకు మద్య అనుసంధానంగా ఉండి ప్రభుత్వం నుంచే వచ్చే సౌకర్యాలను  కేంద్రంలోని భాగస్వాములకు కల్పిస్తారు. ప్రస్తుతం అవి లేకుండానే కేంద్రాలను గత  అద్యక్షులు, మేనేజర్లు కలిసి ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని భోగట్ట.

  •   రెన్యూవల్ లేదు, ఎన్నికలు లేవు:  

ఎన్నికలు జరిపినా, జరపకపోయినా సొసైటీలను ఐదేళ్ళకోసారి  రెన్యూవల్ (పునరుద్ధరణ) చేయాల్సి ఉంటుంది. గత కొన్ని ఏళ్లుగా రెన్యూవల్ ను  నిర్లక్ష్యం చేయడంతో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్లు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో  కొన్ని సొసైటీలను పునరుద్ధరణ చేయకుండానే ఎన్నికలు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి.  1995 చట్టం ప్రకారం ఐదేళ్ళకోసారి సొసైటీ ఆర్ధిక లావాదేవీలను చూసి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. కేంద్రాలను బలోపేతం చేసేందుకు  సంఘాలు ఉండాలంటే తిరిగి మళ్ళీ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి. ఇవి చేయాలంటే సంస్థపై ఆర్థిక భారం పడనుంది. విజయ డెయిరీ  అధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల పునరుద్ధరణకు నోచుకోకపోవడమే గాకుండా సంస్థను నష్టాలపాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  దీనికి నూతన కార్యవర్గంపై అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణమని  తెలంగాణ రైతులు  ఆరోపిస్తున్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఎన్నికలు జరిగాయి. అవే కార్యవర్గాలు ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం.  పదేళ్ళు దాటినా ఇప్పటికీ కార్యవర్గం మాట వినబడడం లేదు. వీటికి బైలా ప్రకారం ప్రతి ఐదేళ్ళకోసారి రెన్యూవల్ చేస్తూ, ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రార్ అధికారి ఉంటారు. పాలకవర్గం గడువు సమీపిస్తుండగానే ఎన్నికలను జరిపించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రకటనను జారీ చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా చొరవ తీసుకోకపోవడంతోనే సొసైటీలలో ఎన్నికల ప్రస్తావన రాకుండాపోయింది.

  • పాత కార్యవర్గంతోనే:

కేంద్రాలలో గతంలో ఎన్నుకోబడ్డ అద్యక్షుల ఆధిపత్యమే కొనసాగుతుందనే ఆరోపణలు రైతుల నుంచి వినబడుతున్నాయి. కేంద్రంలో పాలు పోసే వారికి నెలలో రెండు సార్లు బిల్లులు చెల్లిస్తుంటారు. వీటిని  మాజీ అద్యక్షుడు, డెయిరీ  మేనేజర్ కలిసి సంతకాలు చేస్తేనే బ్యాంకు నుంచి రైతులకు చెల్లుబాటు అవుతాయి. ఇప్పటికీ ఇదే వ్యవహారం కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.

More articles

Latest article